స్వామి వివేకానంద చికాగో విశ్వమత మహాసభల్లో పాల్గొని 125 వసంతాలు నిండిన సందర్భంగా రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్‌ కేంద్రాలు సెప్టెంబర్‌ 2018 నుండి సెప్టెంబర్‌ 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా స్మారకోత్సవాలను నిర్వహించనున్నాయి. చారిత్రాత్మక సంఘటనను పురస్కరించుకొని ‘శ్రీరామకృష్ణ ప్రభ’ 2018 సెప్టెంబర్‌ సంచిక నుండి 2019 సెప్టెంబర్‌ సంచిక వరకు ప్రత్యేక వ్యాసాలను అందిస్తుంది.

చికాగో సర్వమత మహాసభల ప్రారంభదినం, 1893 సెప్టెంబర్‌ 11వ తేదీన స్వామి వివేకానంద తన ప్రసంగాన్ని చిరస్మరణీయమైన ఈ మాటలతో ముగించారు;

“ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట సర్వవిధాలైన స్వమత దురఖభిమానానికి, పరమత ద్వేషానికి – కత్తిచేగానీ, కలంచేగానీ (వ్రాతపూర్వకంగాగానీ) చేయబడుతున్న – అన్ని రకాల హింసలకు మాత్రమేగాక – ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్టుర ద్వేషభావాలకూ శాంతివాఠరమని మనసారా ఆశిస్తున్నాను.”

స్వామీజీ బాటలో పయనం : మానవాళి స్వామీజీ ఆశించిన మతసమన్వయం దిశగా ప్రారంభపు అడుగులు కూడా వేసినట్లు అనిపించడం లేదు. దానికి బదులు వర్దద్వేషాలు, కందబలమూ ప్రధానంగాగల రాక్షసత్వయుగంలోకి ఎనక్కి పయనమవు తున్నామని అనిపిస్తున్నది. కాబట్టి ఇప్పుడు స్వామీజీ ప్రేమ, శాంతి, సమన్వయ సందేశాన్ని ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అది అత్యంత ఆవశ్యకం కూడా!

స్వామీజీ – సర్వమత సమన్వయకర్త : సర్వమత మహాసభ ముందు స్వామీజీ ప్రస్తావించిన ముఖ్య అంశం ఏమిటి? తన ప్రథమ ప్రసంగంలోనే స్వామీజీ ఇలా అన్నారు; “సహనాన్ని మాత్రమెగాక అన్నిమతాలూ సత్యమెనన్న విషయాన్ని ఈ ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. సర్వమత సహనమే కాకుండా అన్నిమతాలూ సత్యమైనవేనని మేము నమ్ముతాం. శాఖాభిమానం, స్వమత దురభిమానం, వీటి ద్వారా జనించిన మూర్త్చాభినివెశం ఆ ఇవన్నీ ఈ సుందరమైన భూమిని చాలాకాలం నుండి ఆక్రమించి ఉన్నాయి. కానీ వాటికి అవసాన సమయం ఆసన్నమైంది.”

స్వామీజీకన్నా ముందర మాట్లాడిన వారందరూ వారివారి మతాల గురించే ప్రసంగించారు. స్వామీజీ ఒక్కరే సర్వమతాల గురించి మాట్లాడారు. అయితే హిందూమత ప్రతినిధిగా హిందూమతం గురించి ప్రసంగించినా, అదేదో వెరుగా ఉన్నదన్నట్లుగాక సర్వమత సమన్వయకర్తగా దాని గురించి తెలివారు. ఎవరూ వారి మతస్వేచ్చను, స్వతంత్రతనూ వదులుకోవాలని స్వామీజీ వాంఛించలేదు. 1893 సెప్టెంబర్‌ 27వ తేదీన జరిగిన ముగింపు సమావేశంలో స్వామీజీ ఇలా ప్రసంగించారు ;

“కెస్తవుడు హిందువుగా మారాలని నేను కోరుకుంటానా? దేవుడు క్షమించుగాక! నేనెప్పడూ అలా కోరను. హిందువుగానీ, బౌద్దుడుగానీ క్రైస్తవునిగా మారాలని నేను వాంఛించను. దైవం క్షమించుగాక! నేనెన్నడూ అలా కోరను.”

ఆ విధంగా చరిత్రలోనే ప్రప్రథమంగా స్వామీజీ విశ్వవేదికపై మతసమన్వయం, సర్వమత అంగీకారం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భారతదేశంలో మతసమన్వయం పురాతనకాలం నుండి అంగీకరింపబడిన “సత్యం” అనేది నిస్సందేహమే.  కానీ ఇటువంటి మహత్తర సత్యం సర్వమత టప్రతినిధు లందరూ సమావేశమైన విశ్వవేదికపై ఇంతకు ముందెన్నడూ ప్రతిపాదింపబడలేదు.

స్నేహపూర్వక ప్రతిపాదన : స్వామీజీ ఈ స్నేహపూర్వక ప్రతిపాదనను ఎవరూ బహిరంగంగా వ్యతిరెకించలేకపోయారు. కానీ మహాసభ ప్రతినిధులలో చాలామందికి అన్ని మతాలూ ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయన్న సత్యాన్ని అంగీకరించడం చాలాకష్టంగా, అయిష్టంగా తోచింది. ఎందుకంటే వారి జీవితకాల మంతా వారికి వాది మతమే అసలైన, నిజమైన మతమని బోధింపబడింది. అంతేకాదు ఇతరమతాలు అసలు మతాలేకాదనీ, ఆ మత అనుయాయులు తమ మతంలోకి మారడానికి ఇష్టపడకపోతే వారిని త్రోసివేయందడనీ బోధింపబడ్డారు.

శాఖాభిమానానికీ, మూర్త్చాఖినివేశానికీ అలవాటుపడిన ప్రపంచం ముందు, మతానికి సంబంధించిన రంగంలో స్వామీజీ మత సమన్వయానికీ, సర్వమత అంగీకారానికి సంబంధించిన సవాలుని విసిరారని మనం చాలా తేలికగా, సులువగా అనవచ్చు. శాస్త్రవిజ్ఞానం అద్భుత రీతిలో అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో, హేతుబద్ధమైన స్వామీజీ సందేశం సరియైన మార్గమని మనం సులభంగా అంగీకరించవచ్చు. కానీ విచారకరమైన విషయం ఏమంటే, వైభవోపేతమైన ఈ శతాబ్దం స్వామీజీ ఐక్యతాసందేశాన్ని అందుకోవడంలో విఫలమైంది. అంతేకాదు, మత మూర్ధత్వం ప్రభావానికిలోనై రక్తపుటిరులు పారడం చూస్తున్నాం.

సర్వమత సమన్వయ సందేశం అందించిన ఈ భారతదేశమే ఘోరమైన మత విద్వేషాలకూ, మూర్ధత్వానికీ సాక్షిగా నిలిచింది. దాని ఫలితంగా లక్షలాది జనులు మృత్యువాతపద్డారు; లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. అంతేగాక దేశం విడగొట్టబదింది. ప్రపంచంలోని ఇతర దేశాల జనులు – ముఖ్యంగా ఐరోపా, మధ్యతూర్పుదేశాలలో మతమౌధ్యం తాండవమాడటం వారు చూస్తున్నారు.

తప్పు ఎక్కడ జరిగింది? : ఇప్పుడిక మనం ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. స్వామీజీ సందేశాన్ని ప్రపంచంలోని జనులు ఎందుకు పట్టించుకోలేదో, భారత ప్రజలు కూడా దానినెందుకు ఆదరించలేదో ఆలోచించాలి. స్వామీజీ తన కాలానికంటే ఎంతో ముందు కాలం గురించి చెప్పారని కొంతమంది అనవచ్చు. కాసీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్వామీజీ మన పురాతన వేదాంత సందేశాన్నె చెప్పారుగానీ వేరేమీ కాదు. ఆ సందేశంలో సర్వజీవ ఏకత్వం, సమన్వయం, శాంతి గురించే చెప్పబడి ఉంది. ప్రస్తుత మానవాళి బహుశా పరిణామ సోపానంలో పురోగతి చెంది, ఈ సందేశ వ్రాధాన్యతను అవగాహన చేసుకునే స్థితికి ఎదగలెదెమోనని అనిపిస్తున్నది. స్వామీజీ సందేశం పూర్తిగా ఆధ్యాత్మికతను పుణికిపుచ్చుకోవడమేగాక హేతుబద్ధంగా, విజ్ఞాన శాస్త్రబద్ధంగా ఉంటుంది.

మతమౌధ్యపు, మూర్ధత్వపు క్రోధాగ్ని జ్వాలలకు బలవుతున్న వారి గురించి వార్తాపత్రికలు  ప్రతిరోజూ మన ముందుకు తీసుకువస్తున్నాయి. కాబట్టి దీని గురించి తీవ్రంగా ఆలోచించి, మానవ మనస్తత్వంలోని ఈ వ్యాధికి కారణాన్ని సరిగ్గా నిరరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ అంశాన్ని నిష్పక్షవాతంగా పరిశీలిద్దాం.

మతాన్ని తీసేస్తె…! : ఈ వ్యాధికి కారణం కనుగొనవలసిన అవసరం ఏమున్నదని కొందరు అనవచ్చు. అది మీరు ‘మతం’ అని పిలిచే అంశానికి సంబంధించిన విషయం కదా! అసలు మానవ సంఘం నుండి మతాన్నె తీసేస్తే బాగుంటుంది కదా! ఆ విధంగా చేస్తే ఆ సమస్యనె పూర్తిగా నిర్మూలించవచ్చుకదా! అనవచ్చు.

బాగుంది. ఈ విధంగా చెప్పడం సులువేకానీ చెయ్యడం చాలా కష్టం. అదెటువంటిదంటే దీర్హకాలంగా తలనొప్పితో పదే  బాధను పోగొట్టాలంటే తలనే తీసెయ్యండన్నట్లుంది. మానవాళికి మతం అత్యంత ప్రధానమైన అవసరం. అందుచేత దానిని మానవుల మది నుండి ఎన్నడూ పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. మతాన్ని నిర్మూలించే దిశలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ అవన్నీ పూర్తిగా విఫలమైనాయన్నది ప్రస్తుత చరిత్ర.

(వచ్చే సంచికలో ‘మతం యొక్క నిజ ప్రయోజనం’)

(*పరమపూజ్య స్వామి స్మరణానందజీ మహరాజ్‌ ప్రస్తుత రామకృష్ణ సంఘ సర్వాధ్యక్షులు)

తెలుగు సేత : డాక్టర్‌ పన్నాల శ్యామసుందరమూర్తి