చరిత్ర మనకు ఏం తెలుపుతోంది? అర్హమైనది ఏది ఉంటే అదే నిలుస్తుంది. శీలం కంటె సుస్థిరంగా నిలవగలిగింది ఏముంటుంది? ఎవరు తమ జీవితంలో శీలాన్ని అధికంగా ప్రకాశింపచేస్తారో, వారే విజయాన్ని సాధిస్తారు.

నా గురుదేవులు తనువు చాలించిన తర్వాత అనామకులమైన, నిర్ధగులమైన మమ్మల్ని మొగ్గలోనే తుంచివెయ్యాలని బలవత్తరమైన సంఘాలెన్నో మాకు వ్యతిరేకంగా నిలిచాయి. కానీ శ్రీరామకృష్ణులు మాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. అది ఏమంటే కేవలం మాటలాడడమె గాక పారమార్ధిక జీవితాన్ని సాగించడానికై ఆజన్మాంతం ప్రయత్నించాలనే ఆకాంక్ష కలిగి ఉండడం.

కావలసింది జనసంఖ్య కాదు, శక్తినామర్భాలు కాదు, సంపద కాదు, పాండిత్యం కాదు, మిగిలినవేవీ కాదు. కావలసినది – పవిత్రత, ఆచరణయుక్తమైన జీవితం. ఒక్కమాటలో చెప్పాలంటే అనుభూమి లేక సాక్షాత్యారం. ప్రతి దేశంలో ఇలాంటి ధీరాత్ములు, బంధవిముక్తులు, బ్రహ్మానుభవాన్ని పొందినవారు; కెదిసంపదలు, అధికారం, పేరు ప్రతిష్టలతో సహా దేన్నైనా లక్ష్యపెట్టనివారు పది పన్నెండుమంది ఉంటే చాలు… వారు ప్రపంచాన్ని ఉర్రూతలూగిన్తారు.

నాకు ఎంత ప్రతిఘటన ఎదురైతే, అంత అధికశక్తి నాలో ప్రకటనమవుతుంది. రాజాధిరాజులు నా వాహనాలను లాగారు. నన్ను పూజించారు. మతాచార్యులు, లోకులు ఒక్కుమ్మడిగా నన్ను దూషించారు. ఐతేనేం? భగవంతుడు వారందరినీ ఆశీర్వదించుగాక! వారంతా ఆత్మస్వరూపాలే కదా! నా శక్తి సామర్థ్యాలు క్రమవికాసం చెందడానికి వారంతా నాకు సహాయభూతులు కాలేదా?

యావజ్జీవితం చేసిన కృషి ఫలితంగా – కనీసం ఒక్క జీవి ఐనా భౌతికబంధాలను తెంచుకొని, ముక్తుదైతే మన విధిని మనం నిర్వర్తించినవాళ్ళమవుతాం.

నిస్సందేహంగా నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నానాటికీ నా దృష్టి వికాసమొందుతూ ఉంది. భారతదేశమెమిటి, ఇంగ్లండ్‌ ఏమిటి, అమెరికా ఏమిటి? అజ్ఞానులు ఎవరిని మానవుడంటున్నారో ఆ భగవంతుని దాసులం మనం. చెట్టుపాదులో నీరు పోసినవాడు చెట్టుకంతా నీరుపోసినవాడవడం లేదా?

సాంఘికంగా గానీ, రాజకీయంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ – నేనూ, నా సోదరుడు ఒకటే అని గ్రహించడమే సకల శ్రేయస్సుకూ ఏకైక మార్గం. అన్ని దేశాలకూ, ప్రజలకూ ఇదే ధర్మాన్ని (సత్యాన్ని) నేను చెబుతున్నాను. ప్రాచ్యుల కన్నా పాశ్చాత్యులే దీన్ని మరింత శీఘ్రంగా గ్రహిస్తారు. ఈ ఆశయాన్ని ప్రతిపాదించడంలో, కొందరు ప్రాచ్యులు తమ శక్తినంతా ధారపోసి అలసిపోయారు.

పేరుప్రతిష్టల మీది కాంక్షనూ, ఇతరుల పై అధికారం చలాయించాలనే కోరికనూ వదలివేసి మనం పనిచెద్దాం గాక! కామ, క్రోధ, లోభాలనె మూడు విధాలైన బంధనాల నుండి మనం ముక్తులమవుదాం గాక! సత్యం మనతోనే ఉంటుంది.