కాన్సూర్‌, ఖరగ్‌పూర్‌, చెన్నైలలోని భారతీయ సాంకేతిక విజ్ఞాన శిక్షణ సంస్థ (ఐ.ఐ. టి)లలో చదువుతున్న విద్యార్థులకు రామకృష్ణ మిషన్‌ స్వామీజీలు వేదాంత పాఠాలు బోధిస్తుంటారు. దేశంలో పేరెన్నిక గన్న ఇలాంటి విద్యాసంస్థలలో మేధావంతులైన విద్యార్థులకే చదివే అవకాశం లభిస్తుంది. మరి వీరికి వేదాంతపాఠాలు బోధించడం ఆశ్చర్యం కలిగిసోందా! నేటి యువతరం చదివే ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రపంచ స్వరూప స్వభా వాలనూ, శక్తియుక్తులనూ ఆవిష్కరిస్తుంది. అయితే ఈ పని చేసే వ్యక్తుల స్వరూప స్వభావాలనూ, అంతర్గత శక్తులనూ శోధించి, వాటిని ఆవిష్కృతం చేసేది – ‘వెదాంతవాణి’. శాస్త్ర విజ్ఞానం నెడు చెస్తున్న మేలే కాక కలిగిస్తున్న హాని గురించి కూడా అందరికీ తెలిసిందే! ఆ ప్రమాదం నుంచి రక్షించడానికీ, సమాజంలో శాంతియుత సహజీవనానికీ, సకల మానవాభ్యుదయానికీ దోహదం చేసేది వేదాంతవాణి. ఆ మాటకొస్తే సమస్త జ్ఞానం, సమస్త శక్తీ మీలోనే ఉన్నాయని భారతీయ వెదాంతం తెలియజేసింది. సమ్యక్‌ భావాస్సీ సమ్యక్‌ దృష్టినీ ప్రబోధించింది. సమాజంలో శాంతియుత సహజీవనానికి, సకల మానవాభ్యుదయానికీ దోహదం చేసింది. అందువల్లే వెదాంతాన్ని ‘అనుష్టాన వేదాంతం’గా చెబుతారు స్వామి వివేకానంద.

సమస్త జ్ఞానం – సమస్త శక్తి

ప్రతి వ్యక్తిలో దివ్యత్వం ఉందన్న సిద్ధాంతాన్ని వేదాంతం ప్రతిపాదిస్తుంది. ప్రకృతిలో ఏవేవి ప్రబలమో, మంచివో, శక్తి మంతమో – అవి అన్నీ దివ్యత్వం వల్లే కలిగాయి. కండరాల శక్తితో మనిషి ఎన్నో ఘనకార్యాలు సాధిస్తున్నాడు. అలాంటప్పుడు తనలోనే దివ్యశక్తి ఉందన్న అత్యున్నత ఆదర్శాన్ని రేయింబవళ్ళు దృష్టిలో ఉంచుకొన్నప్పుడు అత్యుత్తమ కార్యాలు సాధించగలడు. ఆత్మ సర్వశక్తిమంతమని తెలుసుకోకపోవడం ఆత్మ మహిమను విశ్వసించకపోవడమే! ‘తనపై తనకు విశ్వాసం లేకపోవడమే నాస్తికత’ అని స్వామీజీ అన్నారు. ఆ ఆత్మశక్తిని మేల్కొల్పితే మనిషిలో ఎలాంటి పరివర్తన కలుగుతుందో స్వామీజీ ఇలా తెలియజేశారు: “ప్రతి ఒక్కరికీ వారి దివ్యత్వం గురించి బోధించండి. నిద్రిస్తున్న ఆత్మను తట్టి లేపండి. అది స్వస్వరూపంతో మేల్కొనడాన్ని చూడండి. మత్తు వదలి, పూర్తి మెలకువతో అది పనిచేయడం మొదలుపెట్టిన మరుక్షణం అపరిమితమైన శక్తిసామర్జాలు, తేజస్సు, పవిత్రతలు మనస్సులో పెల్లుబుకుతాయి. సాటి లేని మేటి లక్షణాలు మన సొంతమవుతాయి”.

మానవ చరిత్రనంతటినీ పరికిస్తే ఘనకార్యాలు చేసిన స్తీ పురుషులకు ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే! ఏ శక్తి చేత చెవి వింటుందో, ఏ శక్తి చేత కన్ను చూస్తుందో, ఏ శక్తి చేత అయితే మనస్సు గ్రహిస్తుందో, ఏ శక్తి చేత ప్రాణాలు పని చేస్తాయో – ఆ శక్తినే ‘దివ్యత్వం’ లేదా ‘ఆత్మ’ అంటుంది వేదాంతం.

పసివాడైన యువరాజు అంతః పురంలో రాజు రక్షణలో, రాణి చేతులలో నిద్ర పోతుంటాడు. ఒక రోజు కలలో అదవినీ; ఆ అడవిలో పులినీ చూసి ఏడవడం ప్రారంభిస్తాడు. నిజానికి అక్కడ అడవి కానీ, పులి కానీ లేదు. ఎదవదానికంటూ ఏ కారణమూ లేదు. కానీ ఆ కల యువరాజుకు ఏడుపు తెప్పించింది. కానీ తల్లి ఏం చేస్తుంది? యువరాజును నిద్ర నుండి లేపుతుంది. మెలకువ రాగానే తాను అమ్మ రక్షణలో ఉన్నానని గ్రహించి పిల్లాడు నవ్వుతాడు. మన పరిస్థితీ అంతే!

ఈ దృశ్యమాన ప్రపంచమనే కలలో మన దివ్యత్వాన్ని మరచి దుఃఖిస్తున్నాం. అందుకే వేదాంతం ‘ఉత్తిష్టత! జాగ్రత! ప్రావ్వవరాన్‌ నిభోధత! – లేవండి! లేచి మీలో ఉన్న ఆత్మశక్తిని వ్యక్తం చేసే ప్రయత్నంగా జ్ఞానబోధను స్వీకరించండి’! అంటుంది. ఈ వెదాంత వాక్యాన్ని న్వామి వివేకానంద ఒక మహావాక్యంగా చెబుతూ ‘Arise, awake and stop not till the goal is reached. లేవండి, మేల్కోండి గమ్యం చేరేవరకు విశ్రమించకండి‘ అన్నారు. ‘We are responsible for what we are; and whatever we wish ourselves to be, we have the power to make ourselves. మన ప్రస్తుత స్థితికి మనమే కారణం. మనం ఎలా ఉండాలనుకుంటామో, అలా ఉండడానికి కావాల్సిన సమస్త శక్తి, జ్ఞానం మనలోనే ఉన్నాయి’ అని స్వామీజీ పేర్కొన్నారు.

సమ్యక్‌ భావం – సమ్యక్‌ దృష్టి

ఒక ఆధ్యాత్మిక వేత్త ఇలా అన్నారు: మనిషి తన నిజ స్వరూ పాన్ని తెలుసుకోకుండా ప్రపంచాన్ని ఉద్ధరించాలని అనుకోవడం నేల మీద ఉన్న రాళ్ళు, ముళ్ళు గుచ్చుకోకుండా మొత్తం భూభా గాన్ని తోలుతో కప్పే ప్రయత్నం చేయడం లాంటిది. దాని కన్నా కాళ్ళకు పాదరక్షలు వేసుకోవడమె సులభం! శ్రీకృష్ణుడు భగవ ద్లీతలో ‘జీవనం నర్వభూతేషు – సర్వజీవుల ఉనికికి కారణభూత మైన వాదను’ అంటాడు. ఆ చైతన్య వస్తువే అన్నిటిలో ఉంది.

ఆ ఎరుక కలిగి జీవించగలగాలి. చైతన్య వస్తువును దర్శించడం మనకు ఊహకందనిదే కావచ్చు కానీ సదా ఆ భావనలో విహరించగలిగితే అది సాకారమై తీరుతుంది. కేవలం అడవిలో నివసించిన కారణంగా మామూలు పెంపుడు పిల్లి సైతం క్రూరంగా మారిపోతుంది. ‘Today’s imagination is tomorrow’s realization – నేటి ఊహ రేపటికి యథార్థ మవుతుంది’ అని అంటారు ఓ వేదాంతి. అందువల్ల ఆత్మ గురించే వినాలి, దాన్ని గురించే ఆలోచన చెయ్యాలి. దాన్న ధ్యానించాలి.

బాహ్య ప్రపంచంలో కనిపించే వస్తువులపై ఆకర్షణను విడనాడమంటుంది వేదాంతం. బాహ్య ప్రపంచంలో ఏ వస్తువూ శాశ్వత సుఖాన్ని ఇచ్చెది కాదు. ఆ సుఖం కొద్దిరోజులే ఉంటుంది. నిజానికి, ఆ సుఖమనేది ఆ వస్తువులో ఉండదు. మనస్సులోనే ఉంటుంది. ‘ఆ వస్తువు నాకు దక్కింది’ అన్న ఊరట మనస్సుకు సుఖాన్నిస్తుందే తప్ప, సుఖమన్నద్రి వస్తువులో లేనే లేదు. పైగా, మనిషి పెంచుకొన్న ఆకర్షణ ఎప్పుడూ ఆ వస్తువుపైనే ఉండదు. కాలం గడిచాక, ఇంకొక వస్తువు పైకి మరలుతుంది. వాస్తవాన్ని సమ్యక్‌ దృష్టితో దర్శించనంత వరకు భ్రాంతిలో ఉందక తప్పదు.

ఒక ఐంద్రజాలికుడు ఒక గ్రామానికి వెళ్ళి, గ్రామస్థులందరినీ పిలిచి “నేను ఈ పెద్ద భవనాన్ని మ్రింగివేయగలను, చూడండి” అని చెప్పి భవనాన్ని మ్రింగివేశాడట! అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్య చకితులై కోలాహలం చేశారట. ఇంతలో కొంత దూరంలో ఉన్న తాటి చెట్ల మీద కల్లు గీయడానికై ఎక్కిన ఒక వ్యక్తి ఇదంతా చూసి, “అతడు ఆ భవనాన్ని మ్రింగడమూ లేదు, ఏమీ లేదు. దాని ఎదురుగా నోరు తెరచుకొని నిలబడ్డాడు. అంతే!” అని బిగ్గరగా అరిచాదట. మాయకు లోబడినవారందరూ అజ్ఞానంలో చిక్కుకున్నవాళ్ళే. అందుకే, స్వామి వివేకానంద ఇలా అంటారు: మన బుద్దిపై ఒక విధమైన మంచుతెర క్రమ్మినందువల్ల దానికి సత్యం గోచరించడం లేదు. అదే అజ్జతకు కారణం’.

శాంతియుత సహజీవనం – సకల మానవాభ్యుదయం

వేదాంత ఆచరణ హిమాలయాల్లో నివసించే యోగులకే సాధ్యపదేదనడం పరివాటి. నిజానికి, అది పొరపాటు. వేదాంతాన్నే “శ్రుతి” అని కూడా అంటారు. వేదప్రమాణాన్ని ఆచరణలో పెట్టకపోతే శ్రుతి తప్పడమే అవుతుంది. సంగీతంలో శృతి  మేళవింపు సరిగా లేకపోతే పాడేవారికి, వినేవారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో వేద ప్రమాణాన్ని ఆచరించకపోయినా వారికీ, వారివల్ల సమాజానికీ అధోగతే! నా ఆదర్శాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే – మానవాళికి తమలో దివ్యత్వాన్ని గురించి బోధించి, తమ జీవితంలో ప్రతీ కదలికలోనూ ఆ దివ్యత్వం ఉట్టిపడేలా ప్రవర్తించడం ఎలాగో నేర్పించడం’ అంటారు స్వామి వివేకానంద. దివ్యత్వం గురించి తెలియజేయడమంటే వారి ఆత్మస్వరూపాన్ని గుర్తెరగడం! దైనందిన కార్యాల్లో ఆ ఆదర్శానికి తగ్గట్లు నివసించడం! ‘నాలోని దివ్యత్వమే అన్ని జీవరాశుల్లోనూ ఉంది’ అన్న వెదాంతవాక్యం శాంతియుత జీవనానికి నాంది. ఎందుకంటే, మన భావన విస్తృతి చెంది, ఇంట్లో ఉండే వారిని మాత్రమే ప్రేమించే స్థితి నుండి క్రమంగా బంధువులనూ, స్నేహితులనూ, ఇతరులనూ, దేశాన్నీ ప్రపంచాన్నీ ప్రేమిస్తాం. ‘ఇలాంటి విశ్వాసమే ప్రపంచాన్ని ఉద్దరించ గలదు‘ అంటారు స్వామీజీ.

అన్యులంటూ ఎవరూ లేరని తెలిసినప్పుడు ఎవరినని ద్వేషిస్తాడు? తాను అందరితో ఏకమై ఉన్నట్లు తెలిశాక, ఆ దర్శనాన్ని ప్రేమ, సేవల రూపంలో వ్యక్తం చేస్తాడు. చెలిమి, పరోపకారం కలుగుతాయి. మనస్సులో శాంతి, ధన్యత పెరుగుతాయి. సామాజిక చైతన్యం కలిగి, నైతిక విలువలతో కూడిన పార్వ్వం తోడవుతుంది. అందువల్ల కార్యాలయంలో ఉన్నా వాహనం నడుపుతున్నా, ఏ చిన్న పని చేస్తున్నా సరే – ప్రతీ కదలికలోనూ దివ్యత్వం ఉట్టిపడేలా ప్రవర్తిస్తాడు.

స్వామి వివేకానంద ఇలా అంటారు: ‘తను ప్రేమించే వస్తువు ఒక మట్టి వస్తువు కాదనీ, ప్రత్యక్ష దైవమనీ భావించినప్పుడు ఆ ప్రేమ అధికమవుతుంది. తల్లినీ, బిడలనూ భగవత్‌ స్వరూపులుగా భావించి నప్పుడు వారిపై ప్రేమ అధికమవుతుంది. క్షుద్రమైన అహంభావం (నేను అనే భావం) నశించి, దాని స్థానంలో భగవంతుడు సుప్రతిష్టితుడైతే, లోకాన్ని ఉర్రూతలూగించే శక్తి కలుగుతుంది. జగత్తు యావత్తూ కొత్త రూపం దాల్లి కనిపిస్తుంది. ఇప్పటి లోకంలో గల అవినీతి, దౌర్జన్యాలతో సాగిపోవడానికి మారుగా, మానవులందరూ ఈ మహా సత్యాన్ని ఒక లేశాంశమైనా అనుభూతం చేసుకొంటే, లోకస్వరూపమే మారుతుంది. వివాదస్థలిగా, యుద్దభూమిగా ఉండక శాంతినికేతనమై తేజరిల్లు తుంది.’ ఈ విధంగా శాంతియుత సహజీవనానికీ, సకల మానవా భ్యుదయానికీ దోహదం చేసే అభయదాయని వివేకానందుని వేదాంతవాణి.