విద్య అంటే నా అభిప్రాయం గురువుతో వ్యక్తిగత పరిచయం – గురుకులవాసం; గురువు వ్యక్తిగత జీవితంతో పరిచయం లేకపోతే అది విద్యకాదు.

జాజ్వల్యమానమైన అగ్నివంటి శీలం గల గురువు వద్ద బాల్యం నుండి నివసించాలి. అత్యుత్తమమైన బోధస్వరూపుదైన వ్యక్తిని తన ఎదుట చూస్తుండాలి. ‘అసత్యం చెప్పడం వాపం’ అని ఎంత చదివినా ఉపయోగంలేదు. ప్రతి బాలుడికి కఠోర బ్రహ్మచర్యంలో శిక్షణ గరపాలి. అప్పుడు మాత్రమే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధలేనివాడు అబద్ధమెందుకాడడు? మన దేశంలో ఎప్పుడూ త్యాగపురుషులే జ్ఞానాన్ని ప్రనాదిస్తుంటారు. తర్వాతి కాలంలో జ్ఞానాన్నంతా ‘పండితులు’ తమ అధీనం చేసుకొని పాఠశాలలలోనే లభించేటట్లు చేసి దేశాన్ని వినాశ స్థితికి తెచ్చారు. త్యాగపురుషులు జ్ఞానప్రదానం చేస్తున్నంత కాలం భారతదేశం మంచి పురోగమనదశలో ఉండినది.

గురువు లక్షణాలు

* శిష్యుడి ప్రవృత్తికి అనుగుణంగా సహకరించేవాడే నిజమైన గురువు. నిజమైన సానుభూతి లేనిదే మనం ఎన్నటికీ చక్కగా బోధించలేం.

* ఎవరి విశ్వాసాన్నీ చెరపవద్దు. మంచినిచ్చే శక్తి ఉంటే ఇవ్వు, కానీ అతనికున్న దానిని నశింప చెయ్యవద్దు. శిష్యుని మనః న్ధాయికి దిగి, తన ఆత్మను శిష్యుని ఆత్మతో తాదాత్యం చేసి, తన మనోనేత్రంతో అంతా కనిపెట్టగలిగేవాదే నిజమైన గురువు. ఇలాంటి వారే బోధించగలరు.

* బోధించడానికి ముఖ్యంగా కావలసింది ఆత్మశుద్ధి పృదయపవిత్రత. ముమ్మూటికీ బోధకుడు ఎంతో పరిశుద్ధుడై ఉండాలి. అప్పుడే అతడి మాటలకు విలువ ఉంటుంది.

* గురువు కీర్తిప్రతిష్టలు, ధనాశ మొదలగు స్వార్థ చింతనలతో శిక్షణనియ్యకూడదు. మానవాళి యందు పవిత్రపేమతో అతడు బోధన చెయ్యాలి.

శిష్యుడి లక్షణాలు

* శిష్యుడు బాహ్యాంతరాలలో ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచుకోవాలి. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు అన్నీ అధీనంలో ఉండాలి. ఇంద్రియాల ప్రేరణలకు, ప్రకృతి ఆజ్ఞలకు లోనుకాకుండా మనస్సును దృధంగా వశంనందు ఉంచుకోవాలి.

* శిష్యుడికి సహనశక్తి అపారంగా ఉండాలి. జీవితం సుఖంగా ఉన్నట్లు కనిపిస్తుంది; అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనస్సు సవ్యంగా వ్యవహరిస్తుంది. కానీ ఏదైనా ప్రతికూలమైనప్తుడు మనస్సు వశం తప్పుతుంది.

* దుఃఖాలను, కవ్ధాల పట్ల విచారభావం, ప్రతిఘటన గురించిన తలంపు, ప్రతీకారచింత, ప్రతిక్రియను గురించిన ఆలోచన ఏమాత్రం లేకుండా సహనం కలిగి ఉండాలి. ఇది యథార్థమైన సహనం.

* శారీరక వాంఛలు క్షణికమైన సుఖాన్ని నిరంతర దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. పై పొర అమృతమయమై దిగువన విషం ఉన్న వాత్రలాంటిది ఇది! ఈ దారుణ దుస్థితిని బాపుకోవడానికి కోర్మెలను త్యజించడం ఒక్కటే మార్దం.