సోమరితనం, నీచత్వం, మోసం ఈ దేశాన్ని అన్నివైపులా ఆవరించాయి. బుద్ధిమంతుడైనవాడు ఇదంతా చూస్తూ స్తిమితంగా కూర్చోగలడా? అతని కళ్ళల్లో నిరు క్రమ్మదా? మద్రాసు, బొంబాయి, పంజాబు, బెంగాలు ఎటు చూసినా జీవకళ నాకు కనిపించడం లేదు. మీరు గొప్ప విద్యావంతులమనుకుంటున్నారు. ఎలాంటి నిషప్ప్రయోజనమైన విద్యను మీరు నేర్చుకున్నారో తెలుసా? ఇతరుల భావాలను పరభాషలో కంఠస్థం చేసి ఆ భావాలను మీ బుర్రలో నింపి, దాని ద్వారా కొన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీలు సంపాదించి మెం విద్యావంతులం అనుకుంటున్నారు. ఛీ! ఇదీ ఒక విద్యేనా?

అంత చదువుకున్న తర్వాత కూడా, ఇంటింటికీ తిరుగుతూ ‘నాకు ఉద్యోగమివ్వండి’ అని దేబిరిస్తున్నారు. పరుల పాదాలక్రిందపడి నలిగి, పరులకు ఊడిగం చేస్తున్న మీరు మనుష్యులా? సూదితలకు ఉన్న విలువ కూడా మీకు లేదు. కావలసినన్ని నీటి వనరులు, ప్రకృతి సహజ సంపద ఇతర దేశాలకన్నా వేయిరెట్లు అధికంగా ఉండి కూడా అన్నవస్తాలు కరువయ్యాయి. ఈ దేశం ఈనాడు ఇటువంటి స్థితికి దిగజారిపోయింది.

మన వేదాలను,  వేదాంతాలను చూసుకొని విర్రవీగితే ఏం లాభం? సామాన్యమైన అన్నవస్తాలను కూడా ఇవ్వలేని జాతి, తన మనుగడకే ఇతరులపై ఆధారపడే జాతి దేన్ని చూసుకొని విర్రవీగు తుంది? మన మతాచారాలను ప్రస్తుతానికి అవతలకి నెట్టి బ్రతుకుతెరువుకు మొదట పాటుపడండది. మన దేశంలో ఉత్పత్తి చెందే ముది పదార్ధాల నుండి ఇతర దేశాల ప్రజలు బంగారం పండించు కొంటుంటే, గాడిదల్లాగా మీరు వాళ్ళ బరువులు మోస్తున్నారు. మన ముడిసరుకుతో విదేశీయులు రకరకాలైన వస్తువులను ఉత్పత్తి చేసి విక్రయించి కోటీశ్వరులవుతున్నారు. ఇక మీరో, మీ తెలివితేటలన్నింటిని మూటకట్టి, మీకు సంక్రమించిన సంపదనంతా అవతల పారవేసి “అన్నమో! రామచంద్రా?” అని అదుక్కుంటున్నారు.

రత్నగర్భగా ప్రసిద్ధిపొందిన ఈ భారతావనిపై అన్నార్తుల ఆర్తనాదం ఎలా వినిపిస్తున్నదో కళ్ళు తెరచి చూడండి. ఆ కొరతను మీ విద్య తీర్చగలదా? తీర్చలేదు. పాశ్చాత్య విజ్ఞాన శాస్రానికి మీ స్వయం కృషిని జతచేర్చి పంటలు పండించడం వల్ల సాధ్యమవుతుంది తప్ప ఇతరులకు దాస్యం చెయ్యడం వల్ల సాధ్యమవదు. అందుకని తమకు కావలసిన అన్నవస్తాలను తామే ఉత్పత్తి చేసుకునేటట్లు కార్యాచరణలోకి దూకమని ఈ దేశవాసులకు నెను నేర్పిస్తాను. అన్నవస్తాలు లేకపోవడం వల్ల, వాటికై వెంపర్లాడడం వల్ల దెశానికి వినాశస్థితి దాపురించింది. ఈ దుస్థితిని తొలగించడానికి మీరేం చేస్తున్నారు? మీ శాస్త్రాలన్నీ కట్టగట్టి గంగలో వేసి అన్నవస్తాలను సంపాదించుకునే విధానాలను ప్రజలకు బోధించండి. అప్పుడు వారికి శాస్ర్తాలు చదవాలనే ఆసక్తి కలుగుతుంది. కార్యతత్పరతతో వారి ఐహిక అవసరాలు తీరకపోతే, పారమార్ధిక విషయాలను ఎవ్వరూ వినరు. కాబట్టీ వారిలో నిద్రాణమై ఉన్న ఆత్మశక్తిని జాగృతమొనర్చి, ఆ శక్తి తమలో ఉన్నదనే విశ్వాసాన్ని సాధ్యమైనంత వరకు కలిగించి, మొదట ఆహారం సంపాదించుకొనే విధానాన్ని నేర్చి, తర్వాత ధర్మాన్ని బోధించండి.